ఐటీఐ కాలేజీ రోడ్డు పనులు వేగవంతం చేయాలి – ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
Published on 01 Apr 2026, 12:10 AM 58
JH-40748
జనహితం న్యూస్ దుబ్బాక: దుబ్బాక పట్టణంలోని ఐటీఐ కాలేజీ పరిసరాల్లో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శనివారం ఆయన పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్మాణం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా, వేగంతో పాటు నాణ్యతను కాపాడుతూ పనులను పూర్తి చేయాలని అధికారులను గట్టిగా హెచ్చరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఐటీఐ కాలేజీకి రాకపోకలు సులభతరం కావడానికి రోడ్ల అభివృద్ధి కీలకమని తెలిపారు. నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
అనంతరం, ఐటీఐ కళాశాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను కూడా పరిశీలించారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం అత్యంత అవసరమని, ఈ సెంటర్ ద్వారా యువతకు మెరుగైన నైపుణ్యాలు అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
కళాశాల నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, ఆలస్యం లేకుండా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
