పొంగులేటి అక్రమాలు బహిర్గతం? గవర్నర్‌ను ఆశ్రయించిన కేటీఆర్!
Published on 30 Mar 2026, 11:56 AM 72
JH-57072
జనహితం న్యూస్, హైదరాబాద్: రేవంత్ రెడ్డికి దమ్ముంటే పొంగులేటిని బర్తరఫ్ చేయాలి. ఆయన అక్రమాల పైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కూడిన సభా సంఘం వేయాలి. స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలనీ గవర్నర్ కోరారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్, భూకబ్జాల పైన విచారణ చేపట్టాలని భారత రాష్ట్ర సమితి శాసనసభ పక్షం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లాని కలిశారు. లోక్ భవన్‌లో గవర్నర్‌తో దాదాపు గంటకు పైగా సమావేశమైన భారత రాష్ట్ర సమితి నేతలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న అక్రమ మైనింగ్‌ను, అరాచక భూకబ్జాలను గవర్నర్‌కు తెలియజెప్పారు.
ఒకప్పుడు 'ఇందిరమ్మ రాజ్యం' అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో అచ్చంగా ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తీసుకువచ్చిందన్నారు.
దురదృష్టవశాత్తు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ఎమర్జెన్సీ నాటి అరాచక పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పార్టీ నేతలు తెలిపారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన 'రాఘవ కన్‌స్ట్రక్షన్స్' అనే కంపెనీ మైనింగ్ నిబంధనలను ఉల్లంఘించి, అక్రమంగా జంట జలాశయాల పరిధిలో మైనింగ్ నిషేధం ఉన్నప్పటికీ మైనింగ్ చేస్తున్నారన్నారు. సంబంధం లేని భూమిని చెరబట్టి ఎలాంటి మినరల్ డీలర్ లైసెన్స్, పొల్యూషన్ బోర్డ్ అనుమతులు, విద్యుత్ కనెక్షన్లు, పరిశ్రమల శాఖ అనుమతులు లేకుండానే రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా వందల కోట్ల ప్రజా సంపదను, రెవెన్యూ మంత్రి కుటుంబం కొల్లగొడుతుందని అన్ని ఆధారాలతో సహా గవర్నర్ గారికి ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని సభలో లేవనెత్తితే మొత్తం ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సభ నుండి బహిష్కరించారన్నారు. అదే అసెంబ్లీ సమావేశాల్లోనే రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అనే కంపెనీ తప్పు చేసింది, దానికి సంబంధించి మా ప్రభుత్వమే కొన్ని నోటీసులు కూడా ఇచ్చిందని అసలు నిజాన్ని ఒప్పుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. అయితే ఈ అంశం పైన ఎంక్వైరీ పారదర్శకంగా జరగాలని, అందులో భాగంగా మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశామని గవర్నర్‌కు తెలియజేశారు.
ఒకవైపు శాసనసభా సంఘాన్ని ఏర్పాటు చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని, మంత్రి పొంగులేటి వందల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్‌తో పాటు అక్రమ భూకబ్జాలు బయటకు వస్తాయని తెలిపారు. అయితే పార్లమెంట్‌లో ఏమో రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీలు కావాలని పట్టుబడతారు, ఇక్కడ మాత్రం సభా నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం సభా సంఘాలకు విలువ లేదు అన్నట్లు తన సొంత ప్రభుత్వ ఏజెన్సీలతోనే విచారణ చేయిస్తామన్నారు.
ముఖ్యమంత్రే స్వయంగా హోమ్ మంత్రి బాధ్యతలు తీసుకున్నప్పుడు సీబీసీఐడీని లేదా, రాష్ట్ర హోమ్ శాఖ అధికారులతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. అందుకే ఒక శాసనమండలి, శాసనసభ్యులతో కూడిన సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని లేదా ఒక ఇండిపెండెంట్ జ్యూడిషియల్ ఎంక్వైరీ కావాలని గవర్నర్‌కు చెప్పిన విషయాన్ని కేటీఆర్ తెలియజేశారు.
ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పొంగులేటి తన ప్రభుత్వమే చేపట్టే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన్ను బర్తరఫ్ చేసి విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి రక్షకులే భక్షకులయితే సామాన్యుడికి న్యాయం జరగదు కాబట్టి గవర్నర్ ఈ అంశంలో జోక్యం చేసుకొని న్యాయం చేయాలన్నారు. దీంతోపాటు ప్రభుత్వం మొత్తం గవర్నర్ పేరుతోనే నడుస్తుంది కాబట్టి ఆయన జోక్యం చేసుకొని ఒక స్వతంత్ర విచారణ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణకు ఆదేశించే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.
ఈ మొత్తం అంశాలను విని, ఇచ్చిన సాక్ష్యాధారాలను చూసిన తర్వాత ఈ అంశంలో సానుకూలంగా స్పందిస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఈ మొత్తం అంశంలో భారతీయ జనతా పార్టీ కూడా మౌనంగా ఉన్నదని, ఇప్పటిదాకా ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని కేటీఆర్ ఆరోపించారు. గవర్నర్‌కు మేము ఇచ్చిన విజ్ఞప్తి తర్వాత ముందుకు రాకుంటే కచ్చితంగా ప్రజా క్షేత్రంలో ఎండగడతామని, బాధితులకు న్యాయం జరిగేదాకా, అక్రమ మైనింగ్ ఆగే వరకు పోరాటం చేస్తామన్నారు.
ఎవరు అడిగినా విచారణకు ఆదేశిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట మార్చి పొంగులేటి పైన విచారణ చేయడానికి వెనక్కిపోయారని కేటీఆర్ విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే అమృత్ కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం, సింగరేణి కుంభకోణం, హైదరాబాద్ పారిశ్రామిక భూముల హిల్ట్-పి పాలసీ కుంభకోణం.. ఇలా దాదాపు 14 అంశాల పైన ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, వాటిపైన ఎంక్వైరీ చేయాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి కుటుంబమైనా, శ్రీనివాస్ రెడ్డి కుటుంబమైనా చర్యలు తీసుకుంటానని చెప్పిన రేవంత్, ఆధారాలతో సహా పొంగులేటి కుంభకోణాన్ని బయటపెడితే మౌనంగా ఉన్నారు
ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి దమ్ముంటే చర్యలు తీసుకొని తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, పొంగులేటి అక్రమ మైనింగ్ భూకబ్జాల పైన త్వరలోనే మరింత కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
