బిచ్కుందలో ACB మెరుపు దాడులు - ఎక్సైజ్ CI ఇంటిపై సోదాలు
Published on 17 Apr 2026, 02:17 PM 213
JH-52654
జనహితం న్యూస్, బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో అవినీతి అధికారుల గుట్టురట్టు చేసే పనిలో ఏసీబీ అధికారులు సోదాలు స్పీడ్ పెంచింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. స్థానిక ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ నివాసం ఉంటున్న అద్దె ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు జరపడం స్థానికంగా పెను కలకలం రేపింది. అడ్రస్ లేని ఆస్తుల కోసం ఆరా నమ్మదగిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ బృందం, సీఐ ఇంట్లో ఉదయం నుండే క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు లేదా అవినీతి కార్యకలాపాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, నగదు మరియు ఇతర విలువైన ఆధారాల కోసం అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ దాడుల సమయంలో సీఐ ఇంట్లోని పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శాఖలో కలకలం జిల్లాలో కీలకమైన ఎక్సైజ్ శాఖలో సీఐ స్థాయి అధికారిపై ఏసీబీ కన్నెర్ర చేయడంతో ఇతర శాఖల అధికారులలోనూ గుబులు మొదలైంది. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు.
