నూర్జహాన్ మృతి… కార్మిక ఉద్యమానికి తీరని లోటు
Published on 12 Apr 2026, 09:46 PM 70
JH-92550
జనహితం న్యూస్, కామారెడ్డి: సిఐటియు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నూర్జహాన్ (43) అనారోగ్యంతో నిజామాబాద్ పట్టణంలోని వెల్నెస్ హాస్పిటల్లో నిన్నటి శనివారం రోజున సాయంత్రం 4-20 ని.లకు ఊపిరితిత్తుల సమస్య, గుండెపోటుతో మృతి చెందారు. ఈరోజు తన స్వస్థలం కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో కార్యక్రమo నిర్వహించడం జరిగింది. నూర్జహాన్ మరణం కార్మిక, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు. నూర్జహాన్ మృతి పట్ల సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది.పట్టణంలో జరిగిన అంతిమ యాత్ర కార్యక్రమంలో భాగంగా పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా సిఐటి యొక్క కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ నూర్జహాన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నాయకురాలు, జిల్లాలో బీడీ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామ పంచాయితీ, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, మిషన్ భగీరథ తదితర కార్మికుల సమస్యల పరిష్కారానికై పోరాటాలు సమరశీలంగా నడిపిన మిలిటెంట్ నాయకురాలు. అన్నిరకాల కార్మికులను ఐక్యంగా సంఘటితం చేయడంలో నూర్జహాన్ పాత్ర మరువలేనిది. ఆమె కార్మిక హక్కులు, రక్షణ కోసం అనేక ఉద్యమాలు నడిపింది. నూర్జహాన్ మరణం నిజామాబాద్ జిల్లా కార్మికవర్గానికి, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు.
నిజామాబాద్ ట్రేడ్ యూనియన్, ప్రజాతంత్ర ఉద్యమాల నిర్మాణంలో కామ్రేడ్ నూర్జహాన్ ముఖ్యమైన పాత్ర నిర్వహించారని అన్నారు. నూర్జహాన్ చిన్ననాటి నుండే వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలకు ఆకర్షితురాలై అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. తన 8 నెలల పసిబిడ్డతో వరంగల్ సెంట్రల్ జైలులో 18 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపింది. పేదలకు ఇళ్ళు, ఇండ్ల స్థలాలు కావాలని చేసిన భూ పోరాటంలో కూడా పోలీసుల కేసులు, నిర్భంధాలను సైతం లెక్కచేయకుండా అలుపెరగని పోరాటం చేసింది. కడదాకా తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు పాటు పడింది. కార్మికవర్గానికి, ప్రజా ఉద్యమాలకు ఆమె లేని లోటు తీరనిది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా నాయకులు వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు, మోతి రామ్ నాయక్, అరుణ్, రేణుక, బాలమణి, దొడ్లమోహన్, రవీందర్, దశరథ్, మంద శ్రీనివాస్, కర్రల సత్యం మహాదేవి, గౌరీ, పల్లవి, మంగాదేవి, రాజు, కమ్మరి సాయిలు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
