ఊరేగింపుల్లో డీజే పాటలు, ఐటెం సాంగ్స్‌పై నిషేధం.. కర్ణాటక అసెంబ్లీలో చర్చ
Published on 22 Mar 2026, 09:52 AM 5
JH-13533
జనహితం న్యూస్: కర్ణాటకలో మతపరమైన ఊరేగింపులు, జయంతి ఉత్సవాల్లో డీజే సంగీతం, అసభ్యకరమైన ఐటెం సాంగ్స్ వినిపించడం పై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. భక్తి వాతావరణంలో జరగాల్సిన ఈ కార్యక్రమాల్లో అధిక శబ్దంతో కూడిన సంగీతం, అసభ్యకర గీతాలు వినిపించడం సంస్కృతికి విరుద్ధమని భావించిన ప్రభుత్వం వీటిపై నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ అంశంపై కర్ణాటక అసెంబ్లీలో బుధవారం ఆసక్తికరమైన చర్చ జరిగింది. రాష్ట్ర కార్మిక మంత్రి సంతోశ్ లాడ్ ఈ విషయాన్ని సభలో ప్రస్తావిస్తూ, జయంతి ఉత్సవాల్లో డీజేలు పెద్ద సామాజిక సమస్యగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తి కార్యక్రమాల్లో దేవుళ్ల ఊరేగింపులు కూడా డీజే మ్యూజిక్, ఐటెం సాంగ్స్‌తోనే జరుగుతున్నాయంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక మంత్రి శివరాజ్ తంగడగి మాట్లాడుతూ.. డీజే సంగీతం వల్ల వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డీజేలు అధిక శబ్దంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డీజేలు, ఐటెం సాంగ్స్‌పై నిషేధం విధించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో విపక్షాల సహకారం అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా వినాయక చవితి, దసరా, జయంతి ఉత్సవాల సమయంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని ప్రభుత్వం గుర్తించింది. సంస్కృతిని కాపాడే ఈ నిర్ణయానికి ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఇటీవలి కాలంలో మతపరమైన ఊరేగింపుల్లో భక్తి పాటలకు బదులు సినిమా పాటలు, అసభ్యకర గీతాలు ప్లే చేయడంపై భక్తుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. డీజే సంగీతం వల్ల వినికిడి సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే దీనిపై అధికారిక మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. డీజే సంగీతంపై నిషేధం అమల్లోకి వస్తే మతపరమైన ఉత్సవాల నిర్వహణలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
