ప్రజల ముంగిటకే పోలీస్ సేవలు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్
Published on 30 Mar 2026, 06:14 PM 33
JH-49020
జనహితం న్యూస్, ఏలూరు జిల్లా: ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం 'ప్రజల సమస్యల పరిష్కార వేదిక' (పబ్లిక్ గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని హెచ్.జె. దొర కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు స్వయంగా బాధితుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఆధునిక సాంకేతికతతో, పేపర్ లెస్ పద్ధతిలో పారదర్శకమైన ఆన్‌లైన్ విధానంలో సాగింది. మొత్తం 41 ఫిర్యాదులు అందాయి. వీటిలో భూ వివాదాలు, కుటుంబ తగాదాలు మరియు ఆర్థిక మోసాలకు సంబంధించిన అర్జీలే అధికంగా ఉన్నాయి. ఎస్పీ గారు ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టప్రకారం తక్షణమే విచారణ చేపట్టి, నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల కోసం జిల్లా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా, సమీపంలోని సబ్-డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ సూచించారు.
ఆన్‌లైన్ & టోల్-ఫ్రీ సేవలు: ఫిర్యాదుల కోసం meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చని, ఫిర్యాదు స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 టోల్-ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉందని ఆయన వివరించారు.
