జాబ్ మేళాలో 107 మందికి ఉద్యోగాలు - అపాయింట్మెంట్ లెటర్లు అందజేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
Published on 17 Apr 2026, 11:49 PM 5
JH-51615
జనహితం న్యూస్, టీ నర్సాపురం మండలం: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం బర్రింకలపాడు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాను ఆయన ఘనంగా ప్రారంభించారు.
ఈ జాబ్ మేళాలో మొత్తం 205 మంది అభ్యర్థులు పాల్గొనగా, వివిధ ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో 107 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపికైన యువత ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. గ్రామీణ ప్రాంత యువతకు కూడా సమాన అవకాశాలు అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి జాబ్ మేళాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.ప్రతి యువకుడు తన ప్రతిభను మెరుగుపరుచుకొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను యువత ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఎమ్మార్వో వెంకటేశ్వరరావు, డిటి పెద్దరాజు, ఏపిఎం, ఏపిడి, జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, బుచ్చిరాజు, నాలి శ్రీనివాస్, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి మద్ద తేజ, దుగ్గిన శ్రీనివాస్, చిర్రి కృష్ణయ్య, మన్నీడి సాయిబాబా, గురజాల వెంకటేశ్వరరావు, పదం వెంకటకృష్ణతో పాటు వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
