రోడ్ల కష్టాలు తీర్చాలి సిపిఎం డిమాండ్
Published on 28 Mar 2026, 05:48 PM 54
JH-91719
జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ. నర్సాపురం మండలంలోని అంతర్గత రహదారుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ చేసింది. మండల కమిటీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండలం కార్యదర్శి మడకం సుధారాణి అధ్యక్షత వహించగా, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. రవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తిరుమలదేవిపేట - మధ్యాహ్నపురిగూడెం నుండి అప్పలరాజుగూడెం మీదుగా ఉన్న 7 కిలోమీటర్ల రహదారి పనులను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని, ఈ రోడ్డు పూర్తయితే రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించడానికి సుమారు 15 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఎప్పటి నుంచో ప్రజలు, రైతులు కోరుతున్న ఈ రహదారి సమస్యను పట్టించుకోకపోవడం వారి కోరికలను కాలరాయడమేనని రవి విమర్శించారు.
టీ. నర్సాపురం నుండి మక్కినవారిగూడెం, బండివారిగూడెం మీదుగా లక్ష్మీపురం, అక్కిరివారిగూడెం నుండి మర్రిగూడెం, గట్టుగూడెం ప్రాంతాలకు, అలాగే టీ. నర్సాపురం నుండి బంధంచర్ల వరకు ఉన్న రహదారుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు కోరారు.
