ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: కొయ్యలగూడెం ఎంపీపీ గంజి మాల రామారావు
Published on 02 Apr 2026, 01:30 PM 43
JH-45651
జనహితం న్యూస్, కొయ్యలగూడెం: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి మండల పరిషత్ నిధులతో పెద్దపీట వేస్తున్నామని ఎంపీపీ గంజి మాల రామారావు అన్నారు. గురువారం ఆయన మండలంలోని అచ్యుతాపురం, శ్రీరంగపట్నం గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే అచ్యుతాపురం నుండి శ్రీరంగపట్నం వెళ్లే మండల ప్రజా పరిషత్ రహదారి గత కొంతకాలంగా అత్యంత అధ్వానంగా తయారైంది. దీనివల్ల పొలాలకు వెళ్లే రైతులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు నిత్యం నరకయాతన అనుభవించేవారు.
స్థానిక నాయకులు, విద్యార్థులు ఈ సమస్యను ఎంపీపీ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి తన గ్రాంట్ నుండి రూ. 10 లక్షల నిధులను (గ్రావెల్ రోడ్డు కోసం) తక్షణమే మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ ఈ నిధులు సరిపోకపోతే మరో రూ. 3 లక్షలు ఇచ్చేందుకు కూడా సిద్ధమని హామీ ఇచ్చారు. అంతేకాకుండా గ్రామంలోని ఎస్సీ స్మశాన వాటికకు ఏళ్ల తరబడి పైప్‌లైన్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించిన ఎంపీపీ, తక్షణమే స్పందించి పైప్‌లైన్ పనుల నిమిత్తం రూ. 1 లక్ష గ్రాంట్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీపీ చూపిన ఈ చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేసారు. అలాగే ఎంపీపీగా గెలిచినప్పటి నుండి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ, ప్రజాక్షేత్రంలో మమేకమై ముందుకు సాగుతున్నందుకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం గ్రామాభివృద్ధిలో స్థానిక ఎంపీటీసీ మందపాటి తాతారావు లక్ష్మి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మంతెన సోమరాజు, వైస్ ఎంపీపీ తుమ్మలపల్లి గంగరాజు, వైసిపి టౌన్ ప్రెసిడెంట్ నూకల రాము, వైస్ ప్రెసిడెంట్ పూలపల్లి రవి, బుజ్జి బాబు, ఏలూరు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. అలాగే యూత్ నాయకులు భాస్కర్, కోడలి అఖిల్, పూసల రాజేష్, జినిగి కిషోర్, పురిటిగడ్డ వెంకటేష్‌తో పాటు అచ్యుతాపురం గ్రామ కూటమి నాయకులు, సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
