పాదయాత్రలో కదం తొక్కిన ప్రజా సంఘాలు
Published on 18 Apr 2026, 08:42 PM 57
JH-62688
జనహితం న్యూస్, టీ నర్సాపురం: అప్పలరాజుగూడెం మరియు మధ్యాహ్నపువారిగూడెం రోడ్డు కోసం ‘మహా పాదయాత్ర’.. ఏలూరు జిల్లా టీ. నర్సాపురం మండలంలో నిప్పులు చెరుగుతున్న జనం!
"మా ఓట్లు కావాలి.. మా కష్టాలు తీర్చరా?" అంటూ ఏలూరు జిల్లా టీ. నర్సాపురం మండలం తిరుమలదేవిపేట పంచాయతీ సాలిగూడెం గ్రామంలో రైతాంగం, కార్మిక సంఘాలు కదం తొక్కాయి. తిరుమలదేవిపేట పంచాయతీ పరిధిలోని మధ్యాహ్నపువారిగూడెం నుండి సాలిగూడెం, మల్లప్పగూడెం మరియు అప్పలరాజుగూడెం వరకు 6 కిలోమీటర్ల రోడ్డు మరియు వంతెన నిర్మాణం చేపట్టాలంటూ శనివారం చేపట్టిన ‘మహా పాదయాత్ర’ జిల్లాలో సంచలనం సృష్టించింది. 13 ఏళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి బలైపోతున్న సామాన్యుడు, నేడు రోడ్డెక్కి తన హక్కు కోసం గళమెత్తాడు.
కన్నీటి గోదారిలా కూలీల కష్టాలు.. ' వంతెన' లేని బతుకులకు దిక్కెవరు?
ఈ పోరాటంలో విశేషం ఏమిటంటే.. కేవలం నాయకులు, రైతులు మాత్రమే కాదు, పసిపిల్లలు సైతం తమ చిన్నారి పాదాలతో రోడ్డెక్కారు. స్కూలుకు వెళ్లాలన్నా, ఆసుపత్రికి వెళ్లాలన్నా కాలువ దాటలేక, బురదలో కూరుకుపోతూ పడుతున్న అవస్థలను వారు నిరసన రూపంలో వ్యక్తం చేశారు. "మా అమ్మ నాన్నలు పొలానికి వెళ్లాలన్నా.. మేము బడికి వెళ్లాలన్నా భయమేస్తోంది.. మాకు వంతెన ఎప్పుడు కడతారు?" అని ఆ చిన్నారులు అడుగుతున్న ప్రశ్నలు అక్కడి వారిని కలచివేసాయి.
రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వారివి.. పొద్దున్నే లేస్తే పొలం పనులకు వెళ్తేనే గడవని కుటుంబాలు. కానీ, ఆ కూలీల ఆకలి తీరాలంటే కాలువ దాటాలి.. ఆ కాలువ దాటాలంటే చావుతో జూదం ఆడాలి.గ్రామ ప్రజల వాసుల గోడు వినేవారే కరువయ్యారు. వంతెన లేకపోవడంతో చిన్న పిల్లలను బడికి పంపాలన్నా, గర్భిణీ స్త్రీని ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా నరకయాతన అనుభవిస్తున్నారు. బురదలో కూరుకుపోతూ, కాలువ ప్రవాహంలో కొట్టుకుపోతామేమో అన్న భయంతో వణికిపోతూ కూలీలు చేసే ప్రయాణం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.
"55 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించే వంతెనను విస్మరిస్తారా? ప్రజా ప్రతినిధులారా.. ఇక మీ ఆటలు సాగవు!" అంటూ మాజీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వెంకటరత్నం ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతేకాకుండా గత 13 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలను పాలకులు, అధికారులు ఊరిస్తూనే ఉన్నారని అలాగే గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి సాంబశివరావు రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ.. తర్వాతి కాలంలో ఆ నిధులు ఏమయ్యాయో, వంతెన నిర్మాణం ఎందుకు ఆగిపోయిందో సమాధానం చెప్పే నాథుడే లేరని ఇంత తెలిసిన కుడా అధికారులు ఎందుకు మొద్దునిద్ర పోతున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ఈ కార్యక్రమంలో ఏ.రవి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తక్షణమే వంతెన పనులు ప్రారంభించి, ప్రమాదాలను నివారించాలని . "ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడకపోతే.. రేపటి రోజున ఉద్యమం మరింత తీవ్రస్థాయికి చేరుతుంది.గ్రామస్తులు నాయకులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అంతేకాకుండా ప్రభుత్వం స్పందించి ఈ రహదారిని, వంతెనను నిర్మించే వరకు వెనక అడుగు వేసేదే లేదని గ్రామ ప్రజలు భీష్మించుక కూర్చున్నారు. మా బతుకులకు ఒక దారి చూపండి అంటూ చేతులెత్తి మొక్కుతున్న ఈ అభాగ్యుల గోడు ప్రభుత్వానికి వినపడుతుందా? లేక మరో పోరాటానికి దారి తీస్తుందా? అన్నది వేచి చూడాలి.
అలాగే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ సర్పంచ్ యెల్లిన వెంకటరత్నం, మాజీ ఎంపిటిసి సాధనల నరసింహరావు, మాజీ వైసీపీ నాయకులు తమ్మిశెట్టి శ్రీను, వెంకటరామరావు, తమ్మిశెట్టి బ్రమ్మయ్య మరియు ఏ రవి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, సిరి బత్తుల సీతారామయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అనుములు మురళి, సిఐటియు టీ నర్సాపురం మండల కార్యదర్శి మండల కమిటీ సభ్యులు, కుమారి మడకం, కుమారి, బుద్ధుల గంగాభవాని, సారియం దుర్గమ్మ, పూసం సూర్యారావు, కుంజ అక్కమ్మ, కలపాల గాంధీ, వాయిదా రామలక్ష్మి, శిరీష ముండ్రు తదితరులు పాల్గొన్నారు.
