మోదీనే ‘అతిపెద్ద చొరబాటుదారు’.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
Published on 22 Mar 2026, 03:03 PM 15
JH-47407
జనహితం న్యూస్, కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీనే అందరికంటే “అతిపెద్ద చొరబాటుదారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శనివారం రంజాన్ సందర్భంగా కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ప్రజల ఓటు హక్కును హరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
విదేశాలకు వెళ్లినప్పుడు స్నేహం, శాంతి గురించి మాట్లాడే ప్రధాని, దేశంలోకి రాగానే హిందూ-ముస్లిం విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారని ఆమె ఆరోపించారు.
అలాగే పశ్చిమ బెంగాల్‌లో కేంద్రం అప్రకటిత రాష్ట్రపతి పాలనను అమలు చేస్తోందని విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని ఎలాంటి ఒత్తిడులకు గురిచేసినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. బెంగాల్‌ను విభజించాలనుకునేవారిపై కూడా తీవ్రంగా స్పందిస్తూ, అలాంటి ప్రయత్నాలు చేసే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఆమె వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, మతి భ్రమించినట్టుగా మాట్లాడుతున్నారని బీజేపీ నేత సువేందు అధికారి విమర్శించారు.
