చేనేత, పవర్లూమ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Published on 25 Mar 2026, 08:52 PM 56
JH-29290
జనహితం న్యూస్ హైదరాబాద్: చేనేత వస్త్ర పరిశ్రమ, చేనేత పవర్లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ఘాటుగా స్పందించింది. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న పార్టీ అధినేత MLC తీన్మార్ మల్లన్న గారు కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకుని వారికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మల్లన్న గారు మాట్లాడుతూ, చేనేత కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, లేకపోతే ఈ రంగం పూర్తిగా క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అదేవిధంగా, బీసీ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, “బీసీల సమస్యలు రెడ్డి ప్రభుత్వానికి పట్టవా?” అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.
రాష్ట్రంలో జరుగుతున్న ధర్నాలు, నిరసనలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఎద్దేవా చేశారు.
మల్లన్న గారు మరోసారి స్పష్టం చేస్తూ, చేనేత కార్మికుల హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పటికీ వారి పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘాల నాయకులు, TRP పార్టీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
