గజ్వేల్‌లో కేసీఆర్ కార్యాలయంపై దాడి – బీఆర్ఎస్వి నేత తీవ్ర ఆగ్రహం
Published on 05 Apr 2026, 10:06 PM 118
JH-77939
జనహితం న్యూస్, కామారెడ్డి: ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్వి మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు నిదర్శనమని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడైన కేసీఆర్ కార్యాలయంపై దాడి చేయడం అంటే తెలంగాణ ప్రజల గౌరవంపై దాడి చేసినట్టేనని ఎర్రవట్టి సాయిబాబా మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ప్రజలు ఎప్పటికీ సహించరని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత కార్యాలయంపై దాడి జరగడం అత్యంత ఆందోళనకరమని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
అధికార అహంకారంతో కాంగ్రెస్ నాయకులు హద్దులు దాటుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను భయపెట్టేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఎర్రవట్టి సాయిబాబా ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులకే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారికి ప్రభుత్వం అండగా నిలిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీపై ఎలాంటి అణచివేతలు చేసినా వెనక్కి తగ్గబోమని, ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వి మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలపై దాడులు ఆపాలి — తెలంగాణ గౌరవాన్ని కాపాడాలి.
