బాన్సువాడ బస్టాండ్ మరమత్తులకు మంత్రి పొన్నం హామీ
Published on 26 Mar 2026, 07:54 PM 29
JH-33669
జనహితం న్యూస్, కామారెడ్డి మార్చ్ 26: కామారెడ్డి జిల్లా బాన్సువాడ బస్టాండ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ శాసనసభలోని కమిటీ హాల్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. రవాణా సమస్యలు, ఆర్టీసీ బస్టాండ్ దుస్థితి. బాన్సువాడ ప్రాంతానికి సంబంధించిన రవాణా సమస్యలు, ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితిపై మంత్రికి పోచారం వివరించారు.
ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు బాన్సువాడ బస్టాండ్‌ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పాడైన షెడ్లు, చెడిపోయిన వసతులు, భద్రతా లోపాలు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని వివరించారు.
ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు, బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ మరమ్మతు పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన నిధులు, పరిపాలనా అనుమతులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
