రైతుల సమస్యలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ ఫైర్… అధికారులకు కఠిన ఆదేశాలు
Published on 08 Apr 2026, 05:39 PM 102
JH-88303
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ వ్యవసాయ శాఖకు చెందిన అన్ని ప్రభుత్వ అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సమావేశంలో ముఖ్యంగా ఎరువుల లభ్యతపై దృష్టి సారించిన ఎమ్మెల్యే గారు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో యూరియా సరఫరా పరిస్థితిని వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమయానికి సరిపడా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల తాడ్వాయి మరియు ఎస్‌ఎస్ నగర్ మండలాల్లో మొక్కజొన్న పంటకు జరిగిన నష్టంపై కూడా ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టానికి గల కారణాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, రైతులకు న్యాయం జరిగేలా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమర్పించి, రైతులకు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు నియోజకవర్గంలోని 8 మండలాల్లో సుమారు 30,000 ఎకరాల్లో జొన్న పంట సాగు జరుగుతున్నట్లు వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రైతులకు మార్కెటింగ్ సమస్యలు రాకుండా జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.
అదేవిధంగా, భవిష్యత్తులో రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఆయిల్ పామ్ సాగు (పామ్ కల్టివేషన్)పై రైతులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే గారు సూచించారు. పామ్ సాగు ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు మరియు ప్రోత్సాహకాలను రైతులకు వివరించాలని అధికారులను కోరారు.ఈ సమీక్షా సమావేశం ద్వారా రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని, రైతులకు అండగా నిలబడటం తమ ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ప్రతి సమస్యను పరిష్కరించే వరకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తానని తెలిపారు.
