రోడ్డు భద్రతపై అవగాహన… సర్ధనలో పోలీసుల కీలక సూచనలు
Published on 13 Apr 2026, 05:42 PM 121
JH-81963
జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా హావేళ్ళి ఘణపూర్ మండలం సర్ధన గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎఎస్ఐ పి. కిష్టయ్య, నరహరి పాల్గొని గ్రామస్థులకు రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యతను వివరించారు. గ్రామ సర్పంచ్ వినోద్ సతీష్, ఉప సర్పంచ్ రామ్ చందర్, కార్యదర్శి ప్రమోద్ కుమార్, వార్డు సభ్యులు వడ్డే రమేష్, మల్లన్న, రాజు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, యువకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా సేఫ్టీ బెల్ట్, హెల్మెట్ వంటి భద్రతా పరికరాలు ఉపయోగించాలని సూచించారు. వాహనం ఫిట్‌నెస్, లైట్లు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడరాదని హెచ్చరించారు.
అలాగే డ్రైవింగ్ సమయంలో నిద్ర మత్తులో ఉండకూడదని, చిన్నపిల్లలు రోడ్డుపైకి వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, అన్ని నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
