బడ్జెట్ ఆమోదం లేకుండా వేల కోట్ల ఖర్చు – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
Published on 20 Mar 2026, 07:06 PM 56
JH-84957
జనహితం న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి 2024 వరకు శాసనసభ ఆమోదం లేకుండా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 204(3) ప్రకారం, శాసనసభ ఆమోదం లేకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు ఉపసంహరించుకోవడం పూర్తిగా చట్ట విరుద్ధమని,అయినప్పటికీ గత పదేళ్లుగా ప్రభుత్వం ఈ నియమాలను ఉల్లంఘిస్తూ బడ్జెట్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలను ఉదహరిస్తూ మల్లన్న గారు పలు కీలక అంశాలను ప్రస్తావించారు:
2014-15 నుండి 2018-19 మధ్య ₹84,650.99 కోట్ల అదనపు ఖర్చు శాసనసభ ఆమోదం లేకుండా జరిగింది, ఇది ఇప్పటికీ రెగ్యులరైజ్ కాలేదనీ లేఖలో పేర్కొన్నారు.
2018-19లో ₹29,133.69 కోట్లు అదనంగా ఖర్చు చేయగా,
2019-20లో రికార్డు స్థాయిలో ₹47,896.44 కోట్లు అధికంగా ఖర్చు చేసి ఆర్థిక క్రమశిక్షణను పూర్తిగా దెబ్బతీశారనీ తెలిపారు.
ఇదే కాకుండా, బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోయినా (Zero Allocation) వివిధ పథకాల పేరిట భారీగా నిధులు మళ్లించారని ఆరోపించారు:
- 2015-16లో MGNREGAకు ₹350 కోట్లు, దావత్-ఎ-ఇఫ్తార్‌కు ₹14 కోట్లు
- 2017-18లో UDAY రుణాల వడ్డీకి ₹708.22 కోట్లు
- 2018-19లో SC కార్పొరేషన్‌కు ₹1,500 కోట్లు, TRICOR కు ₹900 కోట్లు
- 2019-20లో COVID పేరిట ₹1,186.57 కోట్లు
- 2023-24లో HMWS&SB కు ₹1,913.91 కోట్లు, UDAY బాండ్స్‌కు ₹892.29 కోట్లు
ఈ విధంగా శాసనసభకు తెలియజేయకుండా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది శాసనసభ అధికారాలను అవమానించే చర్య అని మల్లన్న గారు అన్నారు.
ఈ అంశంపై తక్షణమే విచారణ జరిపి, ఆర్థిక శాఖ అధికారులను సభ ముందు హాజరు పరచాలని, రాజ్యాంగ ఉల్లంఘనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారాన్ని "బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్" కింద పరిగణించి చర్యలు చేపట్టాలని చైర్మన్‌ను కోరారు.
ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేసే పరిస్థితికి అడ్డుకట్ట వేయాలని, శాసనసభ గౌరవాన్ని కాపాడాలని మల్లన్న గారు కోరారు.
