వడగండ్ల వానతో పంటలకు భారీ నష్టం – బాధిత రైతులను పరామర్శించిన షబ్బీర్ అలీ
Published on 26 Mar 2026, 04:32 PM 55
JH-93898
జనహితం న్యూస్ కామారెడ్డి మార్చ్ 26: కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి, కంచర్ల గ్రామాలలో ఇటీవల కురిసిన వడగండ్ల వాన కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా పెద్ద మల్లారెడ్డి చెరువు కింద సుమారు ఒక వెయ్యి ఎకరాల్లో సాగు చేసిన వరి పంట పూర్తిగా (100%) నష్టపోగా, మామిడి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లింది.
ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ వెంటనే స్పందించి నష్టపోయిన గ్రామాల్లో పర్యటించారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధిత రైతులను పరామర్శిస్తూ ధైర్యం చెప్పి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
అనంతరం సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో సమావేశమై వెంటనే పంట నష్టం సర్వే చేపట్టి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. రైతులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని తెలిపారు. రైతుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించి వారికి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ,
రైతులు ఎదుర్కొంటున్న ఈ కష్టకాలంలో ప్రభుత్వం వారి వెంటే ఉంటుంది. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా నేను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాను. నష్టపోయిన ప్రతి ఎకరాకు సరైన పరిహారం అందేలా కృషి చేస్తాను అని అన్నారు. రైతులకు అండగా నిలుస్తూ, నష్టపరిహారం త్వరగా అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు సుతారి రమేష్, భీమ్ రెడ్డి, అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, డిసిసి ఉపాధ్యక్షులు గంపప్రసాద్, ఐరేనీ సందీప్, దేవరాజు గౌడ్, గాల్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, మహమ్మద్ సలీం, భూమా గౌడ్, మహేష్, రాజబాబు గౌడ్, లింగ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
