తిరుపతిలో కొత్త టౌన్‌షిప్
Published on 22 Mar 2026, 02:39 PM 8
JH-79642
జనహితం న్యూస్, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు పెద్ద సమస్యగా మారిన వసతి కొరతకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని అలిపిరి వద్ద “ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్‌షిప్” ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్‌పై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని టీటీడీ ఈవో ఎం. రవిచంద్రకు సూచనలు ఇచ్చారు.
తిరుమల కొండపై భక్తుల రద్దీ రోజు రోజుకీ పెరుగుతున్నా, కొత్తగా వసతి భవనాలు నిర్మించడానికి స్థలం పరిమితంగా ఉండటం పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో అలిపిరిని బేస్ క్యాంప్‌గా అభివృద్ధి చేస్తే భక్తులకు పెద్ద ఎత్తున వసతి సౌకర్యాలు కల్పించవచ్చని టీటీడీ అధికారులు ముందుగానే ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సీఎం దృష్టికి తీసుకెళ్లగా, దాన్ని మరింత విస్తరించి పూర్తి స్థాయి ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ఇందుకు సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించి, అన్ని అంశాలను పరిశీలించిన నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.
ఇదిలా ఉండగా, తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. కొండల్లో ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం, కాలుష్య నియంత్రణ కోసం ఎలక్ట్రానిక్ సూచిక బోర్డులను పెంచడం వంటి చర్యలు చేపట్టాలని చెప్పారు. అదేవిధంగా టీటీడీ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు విండ్ పవర్ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఇక భక్తులకు అందించే ఆహారం నాణ్యతను మరింత మెరుగుపర్చే దిశగా తిరుమలలో ఆధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సుమారు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.30 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ ల్యాబ్ దేశంలోనే అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన మొదటి కేంద్రంగా నిలుస్తోంది.
ఈ ల్యాబ్‌లో రసాయన, సూక్ష్మజీవ సంబంధిత పరీక్షల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించడంతో పాటు, భక్తులకు అందించే ఆహారం, త్రాగునీరు సురక్షితంగా ఉండేలా ప్రతి నెల దాదాపు 1500 నమూనాలను పరీక్షించనున్నారు.
అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ ల్యాబ్‌లో GC-MS, ICP-MS, HPLC వంటి సాంకేతిక పరికరాలు ఏర్పాటు చేయగా, ఆహార రుచి, వాసనను విశ్లేషించే ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. టీటీడీ వినియోగించే నెయ్యి, నూనెలు వంటి పదార్థాల నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పరీక్షించడం ద్వారా భక్తులకు ఉత్తమమైన ప్రసాదాన్ని అందించడం ఈ ల్యాబ్ ప్రధాన లక్ష్యంగా ఉంది.
